బోడుప్పల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

మేడిపల్లి, ప్రజానేత్రం ఆగష్టు 14: సిపిఐ పార్టీ మేడిపల్లి మండల ప్రధాన కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కు బోడుప్పల్ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం రచ్చ కిషన్ మీడియాతో మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 63/28 నుండి63/39 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో కోర్టు ఆర్డర్ పేరుతో అక్రమ నిర్మాణం చేశారని, గతంలో మీకు ఈ నిర్మాణాలపై వ్రాత పూర్వకంగా పలు మార్లు ఫిర్యాదు చేశామన్నారు. మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులు కోర్టు ఆర్డర్ గడువు పేరుతో చర్యలు తీసుకోలేకపోతున్నామని, గడువు ముగిసిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ గడువు ముగిసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రభుత్వ భూమిలో 600 గజాలలో పెద్ద ఎత్తున జరిగిన నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటూయుసి మండల కార్యదర్శి దండు రమేష్, బికేఎంయు మండల అధ్యక్షులు భూతం ఐలయ్య, ఇందిరానగర్ శాఖ కార్యదర్శి మాచర్ల కనకయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top