నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహణ

నల్గొండ, ప్రజానేత్రం, ఏప్రిల్ 11: పట్టణాలతోపాటు గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి ఒక్కరు రకరకాల డిజైన్లతో చక్కటి గృహ నిర్మాణాలు చేస్తున్నారు. అలాంటి నిర్మాణాల్లో ఇటుకలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇదే అదునుగా భావించిన ఇటుక బట్టీల వ్యాపారస్తులు అందినకాడికి దండుకుంటున్నారు. దొడ్డి దారిలో నల్లగొండ జిల్లా..పరిధిలోని చింతపల్లి, మాడుగుల, మాల్, మర్రిగూడ, చండూర్ మున్సిపాలిటీ, మునుగోడు దాకా ఇటుక బట్టీలు వెలిశాయి. నేషనల్ హైవేతో పాటు గ్రామాల్లో ప్రధాన రహదారి, జన నివాసాలకు అతి సమీపంలో ఈ బట్టీలు వెలిశాయి.

ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే మొదట గ్రామ పంచాయతీ, పరిశ్రమల శాఖ, మైనింగ్, రెవెన్యూ, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖతో పాటు తదితర శాఖల అనుమతులు పొందవలసి ఉంటుంది. కానీ అవేమి ఇక్కడ కనిపించవు. అనుమతులు ఉన్నాయని వ్యాపారస్తులు అంటే, లేవని అధికారులు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అన్ని కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినవే అని తెలుస్తోంది.

ప్రజల నివాసాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఇటుకలను తయారు చేయాలని నిబంధనలు ఉన్నా వ్యాపారస్తులు అవేం పట్టకుండా గ్రామాల్లో లక్షల వ్యాపారం సాగిస్తున్నారు. చెరువు మట్టితో ఇటుకలు తయారు చేసి, కలపతో ఆ ఇటుకలను కాల్చుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తైనా చూడకపోవడంతో వారి చీకటి స్నేహాలకు అద్దం పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
చెరువు మట్టితో ఇటుకల తయారీ, కలపతో కాల్చడం చెరువు మట్టి తోడాలంటే రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అనుమతులు తీసుకోవాలి. అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమంగా రాత్రి వేళ చెరువు మట్టి తొడిస్తూ బట్టీలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో చోటామోటా నాయకులతో ఒప్పందం కుదుర్చుకుని భూగర్భ వనరులకు హాని తలపెట్టే విధంగా ఒకేసారి పెద్ద పెద్ద రాసులుగా చెరువు మట్టి బట్టీలలో డంప్ చేసి, కలపతో వారు తలచిన కార్యం కానిచ్చేస్తున్నారు.

బట్టీల్లో నలుగుతున్న బాలల బ్రతుకులు: విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుండి14 సంవత్సరాల పిల్లలంతా పాఠశాలల్లోనే ఉండాలి. కానీ ఇటుకలు తయారు చేసే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా మట్టి పనిలో నిమగ్నమవుతున్నారు. విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారుల పట్టింపు లేనితనంతో పిల్లలు చదువులకు దూరమై బట్టిల్లోనే మగ్గుతున్నారు. ఇక ఇటుక బట్టీల వ్యాపారస్తులు తమ లక్ష్యాలని ఎలాగైనా చేరుకోవాలని అత్యాశతో, ఇటుక బట్టీల్లో పనిచేసే బాలల ద్వారా ట్రాక్టర్ నడుపుతూ ఇటుకలు రవాణా చేయడం జరుగుతుంది.

Scroll to Top