మును ‘ బీసి ‘ గోడు వినేదెఎవరు.!

యదాద్రి భువనగిరి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 23: ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నుండి నేటి వరకు అగ్రకులాల నాయకులే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ వస్తున్నారు. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,27,101 మంది ఓటర్లు,నియోజకవర్గం లో నూతనంగా నమోదు చేసుకున్న వారి సంఖ్య మరో 15000 ఓటర్లు. మునుగోడు నియోజకవర్గంలో 75 శాతం బీసీ సామాజిక వర్గం ఓట్లే, ఎస్సీ,ఎస్టీలను కలుపుకుంటే 93 శాతం బలహీన వర్గాల ఓట్లే, కానీ నియోజకవర్గ ఏర్పాటు నుండి నేటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇవ్వడం మర్చిపోయాయి. వారిపై నేటికీ అగ్రకుల నాయకులే పెత్తనం చెలాయిస్తూనే ఉన్నారు. 75 శాతం ఓట్లు బీసీలవే, కానీ వాళ్లలో చైతన్యం లేక ప్రతిసారి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నుండి అగ్రకులాల నాయకులే ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోని,చట్టసభల్లోకి వెళుతున్న సందర్భం… బీసీల్లో ప్రధాన రాజకీయ పార్టీల నుండి బలమైన నాయకులు ఉన్న ఈ మునుగోడు నియోజకవర్గానికి మాత్రం ఏ రాజకీయ పార్టీ బీసీలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం లేదు. ఫ్లెక్సీలు కట్టే కాడ, జెండాలు మోసే కాడ, నాయకులకు జేజేలు కొట్టించుకుంట్టున్నారే తప్ప,ఎమ్మెల్యే టికెట్లు పంచే కాడ మాత్రం బీసీ నాయకులని పక్కన పెడుతున్నారు. ఇది మా మునుగోడు బీసీ సోదరులకు అర్థం కావడం లేదు. అసలు మునుగోడు బీసీల్లో ఐక్యతేది ? మరొక గమ్మతైన విషయం ఏంటంటే దేశ, రాష్ట్ర స్థాయిలో బీసీ వాదాన్ని ప్రతిరోజు వినిపించేలా చేస్తున్న నేతలు ఉన్న ప్రాంతం ఇది. దేశవ్యాప్తంగా బీసీలను రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకు బీసీ కుల గణన చేయాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని మునుగోడు నియోజకవర్గం నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా బీసీలను వివిధ కార్యక్రమాల ద్వారా చైతన్య పరుస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ది ఇదే నియోజకవర్గం. దేశ ,రాష్ట్ర వ్యాప్తంగా బీసిల‌ను చైతన్యపరచిన మునుగోడు తన సొంత గడ్డపై నుంచి బీసీని ఎమ్మెల్యేగా చేయలేకపోతున్నాడు, తాను కూడా కాలేకపోతున్నాడు.

మరొకరు తెలంగాణ ఉద్యమంలో తన మేధోశ్రమంత తన కలంపై పెట్టి ఉద్యమంలో చురుకుగా పాల్గొని జర్నలిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న పల్లె రవికుమార్ గౌడ్ ది కూడా ఇదే నియోజకవర్గం. ప్రతిరోజు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న పార్టీలన్నీ పల్లె రవి ని గుర్తిస్తాయి కానీ తనను కూడా ఏ పార్టీ గౌరవించలేదు. స్వరాష్ట్ర ఏర్పటు తర్వాత కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందనే నమ్మకంతో అందులో చేరిన వివిధ రాజకీయ సమీకరణలు ద్వారా అవకాశం రాకపోవడంతో,తన సతీమణి కళ్యాణిని చండూరు ఎంపీపీగా గెలిపించుకున్నాడు…. మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీని వీడి పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పల్లె రవికుమార్ గౌడ్ కి బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ గా కొద్ది రోజుల క్రితమే అవకాశం కల్పించింది. ఇక బిసి వాదంతో మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఆశించొద్దనే విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పింది పార్టీ… మరొకరు బీ(టి)ఆర్ఎస్ ప్రారంభం 2001 నుండి కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, నేటికీ కూడా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ వాదాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా టీవీ చర్చల్లో పాల్గొని పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉద్యమ సమయంలో పోలీసుల చేతుల్లో లాటి దెబ్బలు తిని,జైలు గడప తొక్కి,టిఆర్ఎస్ ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీకి మంచి గుర్తింపును తెచ్చిన నేత కర్నె ప్రభాకర్ కూడా ఇదే నియోజకవర్గానికి చెందినవారే. కర్నె ప్రభాకర్ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 సర్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తున్నారు అనే ప్రచారం జరిగినప్పుడు, మొట్టమొదటిసారి మునుగోడులో బీసీలకు గెలిచే పార్టీ అవకాశం ఇచ్చిందని అందరూ సంతోషిస్తున్న సందర్భంలో.. కర్నె ప్రభాకర్ కు చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిత్వం చేజారిపోయింది. 2018లోనైన కష్టపడిన నేతకు ఇస్తారనుకుంటే అది కూడా జరగలేదు. గత సంవత్సరం జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసిన అగ్రకులాల ఆధిపత్యానిదే పైచేయి అయ్యింది. 2023 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా బీసీలకే అవకాశం ఇస్తారనే నమ్మకంతో,విశ్వాసంతో నియోజకవర్గ ప్రజలు కర్నె ప్రభాకర్ కి ఈసారి అవకాశం ఇస్తారని కోరుకున్నప్పటికీ, మళ్లీ బీసీ నేతకు నిరాశే మిగలడంతో నియోజకవర్గ ఎస్సీ,ఎస్టీ,బీసీల్లో కొంత నిరాశే మిగిలింది. మనలో ఐక్యత లేనంతవరకు మన బ్రతుకులు మారవనే భావనలో కొంతమంది నియోజకవర్గ ప్రజలనోట ముచ్చట్లు.

మరొకరు నియోజకవర్గంలోని బిఆర్ఎస్ లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డ నారాబోయిన రవి ముదిరాజ్, నియోజకవర్గంలో విస్తృతంగా వివిధ సామాజిక కార్యక్రమాలను చేపడుతూ నియోజకవర్గంలో తన క్యాడర్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా బీసీ వాదాన్ని కూడగట్టుకుని ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ రాలేదు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. తన సతీమణి స్వరూపా రాణి ని టిఆర్ఎస్ తరఫున మునుగోడు జడ్పిటిసి గా గెలిపించుకున్నాడు. ప్రస్తుతం జడ్పీటీసీగా కొనసాగుతున్నారు వారి సతీమణి. నారబోయిన రవి ముదిరాజ్ బిఆర్ఎస్ తరఫున మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు, నియోజకవర్గ వ్యాప్తంగా గోడలపై వాల్ రైటింగ్స్, సామాజిక కార్యక్రమాలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితి. మునుగోడు నియోజకవర్గం లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీకి అవకాశం ఇవ్వాలని బలంగా ఆశించాడు, ఆర్థికంగా తాను కూడా బలంగా ఉండడంతో,తాను ముదిరాజ్ కోటాలో నాకు అవకాశం ఇవ్వాలని తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించాడు. నారాబోయిన రవి ముదిరాజ్ కి జిల్లా మంత్రి అండదండలు ఉన్నట్టు తన సన్నిహితుల మాట. ప్రకటించిన అభ్యర్థికి బీఫామ్ ఇంకా ఇయ్యలేదు కదా అని ఇంకా నియోజకవర్గంలోనే తిరుగుతూనే ఉన్నాడు రవి, చివరి ప్రయత్నం చూడాలి మరి, తన ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా అనే విషయాన్ని…. నియోజకవర్గ బిఆర్ఎస్ లో మరొక బీసీ నేత కర్నాటి విద్యాసాగర్, మంత్రి కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు అనేది నియోజకవర్గంలో కొంత ప్రచారం ఉంది. నాంపల్లి, చండూరు, మర్రిగూడ కొన్ని మండలాలలో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వచ్చినా, బిసి బిడ్డనైన నాకు పద్మశాలి సామాజిక వర్గ కోటాలో తనకు అవకాశం వస్తుందని ఆశించాడు, నియోజకవర్గ వ్యాప్తంగా గోడల మీద వాల్ రేటింగ్స్ రాయించడం,కొన్ని ప్రాంతాల్లో గతంతో హమి ఇచ్చిన ప్రకారం వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు దాతలుగా నిలవడం, అధిష్టానం మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆశించాడు, కానీ చివరికి అవకాశం రాకపోవడంతో ప్రస్తుతం మౌనంగా ఉన్నారు… కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గనికి చెందిన బలమైన బీసీ నేత, విద్యార్థి ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న పున్న కైలాస్ నేత ది ఇదే నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీ తరఫున 2018లో ప్రయత్నం చేశాడు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ప్రయత్నం చేశాడు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం బీసీ బిడ్డలైన నాకు అవకాశం కల్పించాలని అధిష్టానం వద్దనైతే దరఖాస్తు అయితే చేసుకున్నాడు.. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు అవకాశం ఇస్తుందా లేదా అనేది.?…. మునుగోడు నియోజకవర్గం నుండి టిడిపిలో రాష్ట్ర కార్యదర్శిగా పట్టిన జెండాను దించకుండా మొదటి నుండి పార్టీ కోసం పని చేస్తున్న మా ప్రాంతం నుండి బీసీ నాయకుడు రాష్ట్రస్థాయిలో ఎదగడం మంచి పరిణామం అనుకున్నారు ప్రజలు. రాష్ట్ర టిడిపిలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న జక్కలి ఐలయ్య యాదవ్ ది కుడా మునుగోడు నియోజకవర్గమే. ఎమ్మెల్యే కావాలనే ప్రయత్నంలో కొనసాగడమే నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాడు. ఈ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితి లేదు ,పొత్తులో తనకు అవకాశం వచ్చే వీలు లేదు, ఒంటరిగా బరిలో నిలిచే ఆలోచన ఉన్న,పార్టీ అధిష్టానం బీసీ బిడ్డకు అవకాశం ఇస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. నిత్యం నియోజకవర్గంలో బహుజన వాదాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. గతంలో తమ పార్టీ నుంచి టికెట్ కొరకు ప్రయత్నించిన పొత్తులో భాగంగా చేజారిపోయింది.

ఇంతమంది బీసీ నేతలు ఉన్న మునుగోడు నియోజకవర్గంలో పట్టుకోల్పోవడం బాధాకరమైన విషయమే.

వీళ్లలో ఐక్యతేది ? మునుగోడు బీసీ నేతల ఐక్యత గురించి ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 14న రోజున హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లే ఆహ్వాన జాబితాలో తన పేరు లేదని, బీసీ ప్రజా ప్రతినిధినైనందుకే తనని అవమానపరిచారని, మునుగోడు నియోజకవర్గంలో భాగమైన సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి, అధికార బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా బహుజన బిడ్డను అవమానపరిచి, తన ఆత్మగౌరవాన్ని, తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ముందు వందల మందితో ధర్నా నిర్వహించడం, మరుసటి రోజు ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేయడం. మరో రోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇదంతా వారం రోజులపాటు సాగిన ప్రక్రియ, ఒక బీసీ బిడ్డ మునుగోడు నియోజకవర్గంలో మన జాతుల ప్రజల గొంతుకై,ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసేందుకు పెద్ద యుద్ధమే చేస్తే, పైన తెలిపిన బీసీ నేతలు ఎవరు మద్దతు నిలవలేదు. అండగా నిలబడలేదు. కనీసం మద్దతుగా పత్రికా ప్రకటన కూడా చేయలేదు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మునుగోడు నియోజకవర్గ బీసీల్లో ఐక్యత ఏ విధంగా ఉందో ?…. బిజెపి నుండి రాజగోపాల్ రెడ్డి దాదాపు ఖరారు అయినట్టే, కాంగ్రెస్ నుండి చలమల్ల కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికి, విశ్వసనీయా వర్గాల సమాచారం ప్రకారం మిగతా పార్టీల అభ్యర్థులు కూడా పైన తెలిపిన వారె అనేది సమాచారం, చూడాలి మార్పు ఉండొచ్చు, లేకపోవచ్చు.. వీరె నిలబడితే మునుగోడు నియోజకవర్గం లో రెడ్డి ‘ డీ ‘…… మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక శాతం బీసిలు,ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు చెమటను చిందించి, కష్టపడండి మీ బ్రతుకులు బాగుపడతాయి. రాజకీయ ఎత్తుగడతో వ్యూహంతో కొందరు మన కంట్లో మన చేతినే పొడుస్తారు. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన సందర్భం ఇది. రాయితీల కోసం కాదు రాజ్యాధికారం కోసం పోరాడు మునుగోడు నియోజకవర్గ బీసి లారా..! మునుగోడు నియోజకవర్గ బీసీల్లో చీము,నెత్తురు ఉంటే మునుగోడు గడ్డపై బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు చైతన్య పడండి. లేదా అభ్యర్థులు ఇచ్చే తాయిలలకు బీసీ వాదాన్ని తాకట్టు పెట్టండి.

గుండమల్ల సతీష్ కుమార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్,
సెల్: 9493155522.
Scroll to Top