చండూరులో జోరుగా అక్రమ ఇసుక రవాణా…

నల్గొండ, ప్రజానేత్రం, మార్చి 21: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాల్టీ మండల ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛ కొన సాగుతోంది. ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిబంధనలకు పాతర వేస్తూ వాగులు, వంకలను అడ్డాగా చేసుకొని తవ్వకాలు జరుపుతున్నారు. ఉడుతలపల్లి. పడమాటాతళ్ల. కొరటికల్. గ్రామంలోని వాగులో రాత్రి వేళల్లో ఈప్రాంతాల నుంచి పాలు గ్రామాలకు తరలిస్తున్నారు. ఆయాప్రాంతాల నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా ఇప్పటికే లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకొని అధికారులకు మామూళ్లు ముట్ట జెప్పడంతో నాయకులు ఆడిందే ఆట, పాడిందే పాట గా కొనసాగుతుంది. వాగులలో ఇసుక అక్రమ రవా ణా వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. యంత్రాలను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా ఇసుకను తోడిస్తుండడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోతుంది. గతంలో వాగులలో నీటిజాలు పుష్కలంగా ఉండగా ప్రస్తుతం జాడ కనిపిం చడంలేదు.

ఇసుకాసురులు రెచ్చిపోతున్న ఇటు రెవెన్యూ, అటు మైనింగ్‌, పోలీసు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఉన్నతాధికారులకు అజ్ఞాత వ్యక్తులు సమాచారం అందించే సమయంలో మాత్రం హడావుడి చేసి తరు వాత అక్కడ ఏమీ జరగలేదన్నట్లు మిన్నకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక క్వారీయింగ్‌ చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమైతే అలాంటిదేమీ లేకుండానే అక్రమార్కులు పోలీసు, రెవెన్యూ , మైనింగ్‌ అధికారుల సహకారంతో ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగిస్తూ లక్షల రూపాయలు వెనుకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల చేతివాటం ప్రదర్శిస్తుడడంతో ఇసుకాసురుల పని మూడు పువ్వులు.. ఆరుకాయలుగా ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Scroll to Top