సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: సినిమాల పేరుతో చరిత్రను వక్రీకరించి, విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న చర్యలను ప్రజలు, ప్రజాతంత్ర వాదులు,మేధావులు తిప్పి కొట్టాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు బంగారు వెంకటేష్ బుదవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గూడూరు నారాయణరెడ్డి ప్రొడ్యూసర్ గా సైలెంట్ జీనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ ట్యాగ్ లైన్ తో రజాకార్ అనే సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసిందని, ఈ టీజర్ కేవలం ఒక వర్గం ప్రజలపై మరొక వర్గం దాడిగా చూపుతూ ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చేలా ఉందని ధ్వజమెత్తారు. ఈ సినిమాలో తెలంగాణ ప్రజల సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించి, ప్రజల మధ్య చీలిక తెచ్చేలా, మతోన్మాదన్నీ రెచ్చగొట్టేలా తీసి విడుదల చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. మతహింస ను ప్రేరేపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర హైకోర్టు, సెన్సార్ బోర్డు స్పందించి ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చే సినిమాలను బ్యాన్ చేయాలని కోరారు.