పీర్జాదిగూడ 5 వ డివిజన్ మెయిన్ రోడ్ లో అక్రమ షెడ్ పై మొదటి నోటీసులు జారీ చేసిన పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు
మేడిపల్లి, ప్రజానేత్రం, మార్చి 15:
కాసులు ఇస్తే అనుమతులతో పనిలేదు. ఎలాంటి నిర్మాణమైన చక చక కానియేచ్చు. ఫిర్యాదులు వస్తే మాత్రం నోటీసులు ఇచ్చాం పరిశీలిస్తాం అంటూ బుకాయిస్తారు. కానీ చర్యలు మాత్రం శూన్యం భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అనే దూరదృష్టితో అక్రమ షెడ్ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి మమా అనిపిస్తారు.చర్యలు ఏవి అని ప్రశ్నిస్తే మాత్రం నోటీసులు ఇచ్చాం, టాస్క్ ఫోర్స్ కు తెలియజేశాం, ఇక మా చేతులో ఏమీ లేదు అంటూ తప్పించుకుంటారు.కానీ నిరుపేదలు బలహీనులపై మాత్రం ప్రతాపం చూపించి ముందు వెనుక చూడకుండా కూల్చివేతలు చేయిస్తారు.ఇది పీర్జాదిగూడ టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న నిర్వాహకం.
జనావాసాల మధ్య అక్రమ షెడ్లు, గోదాంల నిర్మాణం
సాధారణంగా భవన నిర్మాణానికి జీ ప్లస్ టూ అనుమతులు లేదా జీ ప్లస్ ఫైవ్ అనుమతులు జారీ చేస్తారు.జనావాసాల మధ్య భారీ గోదాంలు లేదా షెడ్లు నిర్మాణం చేసేందుకు మాత్రం ఎటువంటి అనుమతులు జారీ చేయరు.కానీ *పీర్జాదిగూడ 5 వ డివిజన్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి.మెయిన్ రోడ్ సమీపంలో ఓ వ్యక్తి భారీ షెడ్డు నిర్మాణం చేపట్టాడు. ఇంత భారీ ఎత్తున అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.
నోటీసులు ఇచ్చి మమా అనిపిస్తారు…
అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు ర్యవేక్షణ జరిపి సదరు నిర్మాణాలకు ముందస్తుగా టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇస్తారు. నోటీసు సమయం పూర్తయినప్పటికీ సరైన రీతిలో నిర్మాణదారుడి నుంచి స్పందన రాకపోతే ఆ నిర్మాణాన్ని కూల్చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తారు.కానీ ఇక్కడ అక్రమ నిర్మాణాల విషయంలో తమ తప్పు ఏమీ లేదు అనిపించుకునే విధంగా మాత్రమే టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు పని కానిస్తున్నారు. కానీ సదరు నిర్మాణాన్ని పూర్తిగా ఆపేయడం గాని లేదా కూల్చివేసే దిశగా గాని అడుగులు వేయడం లేదు. అక్రమ నిర్మాణాలపై ఏమి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నిస్తే వారి నుంచి వచ్చే మొదటి సమాధానం చూస్తాం.. పరిశీలిస్తామని, నోటీసులు ఇచ్చామని టాస్క్ ఫోర్స్ అధికారులకు సిఫార్సు చేశాం అని మాత్రమే తప్ప మరో విషయం ఉండదు.